యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి
నిరుద్యోగ యువత అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఎం మాలకొండయ్య అన్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో చీరాల్లోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందించి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 14 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు మొత్తం 375 మంది హాజరు కాగా వారిలో 137 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ జాబ్ మేళాలో సంస్థ అధికారి ఎం.మాధవి, ఉపాధి కార్యాలయ అధికారులు హారిక, గాంధీ, కళాశాల ప్రధానాచార్యుడు పుష్పరాజు, కాళహస్తి దేవాలయ కమిటీ సభ్యురాలు రజని, ఎఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.